JanaPadhma_EPaper_TS_20-10-2024
లాఠీల రాజ్యం..
ప్రశ్నిస్తే వీపులు సాపే..
విరుచుకుపడుతున్న పోలీసులు..
అన్యాయంపై నిలదీస్తే అంతే సంగతులు..
రాష్ట్రంలో ఖాకీల దాష్టీకం..
భయాందోళనలో ప్రజలు.. పెదవి విరుస్తున్న మేధావులు..
వీపులు సాపవుతున్నాయి. మాటలు బయటకొస్తే చాలు కట్టెలు పొట్టుపొట్టు విరుగుతున్నాయి. అస్సలు అడుగడమే చేయొద్దా.., ఆశించింది మరీ ఎక్కువనా.., లేదంటే ఆ వ్యవహారమే ఇంతనాగానీ.., రాష్ట్రంలో లాఠీ రాజ్యమేలుతున్నది. మొన్న అశోక్ నగర్ సాక్షిగా గ్రూప్ 1 అభ్యర్థుల భరతం పట్టిన విషయం మరువకముందే నిన్న ముత్యాలమ్మ సమక్షంలో మరోమారు స్వైరవిహారం చేసింది. అన్యాయంపై ప్రశ్నిస్తే చాలు సమాధానం చెప్పేది లాఠీయే అవుతున్నది. రోడ్డెక్కి నినదిస్తే చాలు పోలీసే నోరు మూయిస్తున్నాడు. కోరుకున్న పాలనలో ఊహించని పరిణామాలతో జనమంతా నీరసించిపడిపోతుంటే., తొక్కుకుంటూ, రెచ్చిపోతున్న పాలకులు మాత్రం మరింత బూస్టింగ్ అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. వలయాలే అక్కర్లేదన్న నాయకులు ఇప్పుడు పద్మవ్యూహమంటి వలయాల్లో పదిలంగా ప్రయాణిస్తూ.., బతుకు దెరువు కోసం గొంతెత్తుతున్న వారిని కటకటాల్లోకి నెట్టేందుకు వెనకాడని దయనీయమైన దుస్థితికి హస్తం సాక్ష్యంగా మారింది.
======================
రాష్ట్రంలో లాఠీ రాజ్యమేలుతున్నది. పోలీసులు అమాయకులపై విరుచుకపడుతున్నారు. పాలకులిచ్చిన ధైర్యమో., ప్రజలంటే అలుసోగానీ రక్షకభటులు సామాన్యుడిపైబడి చచ్చేలా కొడ్తున్నారు. కడుపు బాధను కూడా చెప్పుకునే ధైర్యం చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటల తీరుతో మరింత రెచ్చిపోతున్నారు. పార్టీల మధ్య పోరు చివరకు ప్రజాసమస్యలపై కూడా గొంతువిప్పలేని నిస్సహాయ స్థితికి చేరింది.
ప్రశ్నిస్తే వీపులు సాపే..
జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే ఇక మూడినట్టే అని పరిస్థితి కల్పిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇదేమని ప్రశ్నించిన పెద్దలే ఇప్పుడు అదే పంథాను అనుసరిస్తూ తేడా ఏముండదు అనే సందేశాన్ని ఇస్తున్నారు. మారింది సర్కారే తప్ప మేమెప్పటికి ఇంతే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అప్పుడు చేసింది నచ్చకనే మార్పు కోరుకుంటే, మార్పు ఆశించడం మీ తప్పు, మేం మాలాగే ఉండడం మా నైజం అన్నరీతిలో రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నట్టు జరుగుతున్న పరిణామాలతో తెలుస్తున్నది. గ్రూప్ 1 అభ్యర్థుల న్యాయమైన డిమాండ్ ను కూడా చట్టవిరుద్ధం అన్నట్టుగా చూసి అర్థరాత్రి వేళ వారిపై విరుచుపడిన ఘటన మరీ ఆక్షేపనీయం.
గతంలో క్యాంపస్ లు, యూనివర్సిటీల్లో విస్తృతంగా పర్యటించి నిరుద్యోగులు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటి, అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడిన మహనీయులే ఇప్పుడు సర్కార్ పెద్దలుగా వెలుగబెడుతూ అంతా ఆ తాను ముక్కలే అన్న నగ్న సత్యాన్ని చాటుతున్నారు.
విరుచుకుపడుతున్న పోలీసులు..
అధికార పార్టీ ఏదైతే దానికి కొమ్ము కాయడమే పనిగా ఖాకీలు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రజా భద్రతకు పెద్దపీట వేయడం మరిచి కేవలం ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం, వారి ఆదేశాలను అమలులో పెట్టడమే విధిగా భావిస్తున్న తీరుపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అన్యాయాన్ని అరికట్టాల్సిన యంత్రాంగం, పాలకులు దానిపై ప్రశ్నించడాన్నే తప్పుగా, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా భావిస్తూ తీవ్ర అన్యాయం చేయడం మరీ దారుణమని బాధితులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. బాధలు తీర్చాల్సిన పెద్దలే తమకు అతి బాధాకరమైన పరిస్థితిని కల్పిస్తే తామెవరికి చెప్పుకునేదని దు:ఖిస్తున్నారు. రాష్ట్రం ఇంత అధ్వానమైన పరిస్థితికి వెళ్లడానికి ఇంత తక్కువ సమయం పడుతుందని అనుకోలేదని ప్రధాన ప్రతిపక్షం విమర్శిస్తుండగా, మేధావి వర్గం కూడా ఇలాంటి చర్యలు అతి దరిద్రానికి నిదర్శమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఈ అనిశ్చితి వాతావరణాన్ని చేధించి సర్కార్ దిద్దుబాటు చర్యలకు ఆలస్యం చేయొద్దని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.