Monday, December 30, 2024
HomeTelanganaకొసెళ్లేనా..?! మాఫీ.. హైడ్రా.. మధ్యలో డ్రామా..?

కొసెళ్లేనా..?! మాఫీ.. హైడ్రా.. మధ్యలో డ్రామా..?

జనపదం సోమవారం -27-08-2024 E-Paper

కొసెళ్లేనా..?!

మాఫీ.. హైడ్రా.. మధ్యలో డ్రామా..?

సీఎం రేవంత్ చాలెంజింగ్ టాస్క్
పులిమీద స్వారీ.. దిగితే బ‌లే..!
సీఎం తీరుపై స్వపక్షంలోనే కుట్రలు..?
చాపకింద నీరులా వేరుకుంపట్లు..
ఏకమవుతున్న అఖిలపక్షం…?
అద్భుత ఫలితమో…. నోటికి ఫలహారమో..?
‘అప్పులు పూడ్చే.. అక్రమాలు కూల్చే..’ ఆటలో బలయ్యేదెవరో..?

================

పూడ్చుడు.. కూల్చుడుకు మధ్య నడుస్తున్న రణం…
కత్తి అంచుమీద సాగుతున్న నడక…
అగాథం కొన మీద చేస్తున్న విన్యాసం…
===========
పట్టుదలకు, పట్టువిడుపునకు మధ్య బెట్టుగా సాగిస్తున్న సమరంలో విజయమో, వీర స్వర్గమో తేలడానికి సమయమున్నా., సాగుతున్న తీరే అందరిలో ఉత్కంఠ. స్వపక్షంలోని విపక్షపు స్వార్థపాలోచన.., విపక్షంలోని మిత్రపక్షపు చేయూత సైగలు.. వెరసి రెండు పడవలపై సాగుతున్న ప్రయాణపు బ్యాలెన్స్ పైనే అందరి గురి. మాఫీని మానియాగా ప్రచారం కల్పించిన ప్రతిపక్షం.., హైడ్రాను అనవసరం అన్నట్టుగా కలర్ పులుముతున్న అఖిలపక్షపు బలంలో ఒంటరైన సాహసం ఆఖరి వరకు వెళ్తుందా..? లేదంటే అడుగడుగుకు ఎదురవుతున్న ప్రతిఘటనలకే బలాన్ని ఖర్చు చేస్తూ మధ్యలోనే చేతులెత్తుతుందా…? అనేది ఇప్పుడు పెద్ద పశ్న. రుణం వరకు అంతా ఒక్కటిగానే అనిపించిన హస్తం బలం, హైడ్రా పరాక్రమణలతో వేరుపడిన చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆఖరికి సీఎం అండ్ హైడ్రా టీం మీదే అన్నీ ఆధారపడ్డాయనే సంకేతాలు మాత్రం సుస్పష్టం.
===========================
జనపదం, బ్యూరో

నిజానికి సీఎం రేవంత్ ఒంటరి పోరాటమిది. తన వెంట అంతా ఉన్నట్టుగా కనిపిస్తున్నా సహకారం అందించే వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన విజన్ కు తామే బలిపశువులు అవుతున్నామని స్వపక్షంలోని స్నేహితులే చాటుమాటుగా విమర్శిస్తున్నారు. దశాబ్దాలుగా ఏర్పాటు చేసుకున్న కోటలు కూలుతుంటే తట్టుకోవడం వారి వల్ల కావడం లేదు. అందుకే ఏ జెండా కిందా ఉన్నా, వ్యాపార వర్గం అంతా ఒక్కటే అన్నట్టుగా అన్ని పార్టీల ఆ బాపతు నేతలంతా ఒకే తాటిపైకి వచ్చారు. పైకి గంభీరంగా మాట్లాడుతున్నా లోపల మాత్రం సీఎంపై కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అణుచుకుంటూ,అనుకూలమైన సమయం కోసం చూస్తున్నారు. ఇష్టంలేని వ్యక్తి అని ఇప్పటికే అధిష్టానంతో టచ్ లోకి వెళ్లిన కొందరు ఇప్పుడు హైడ్రా ఒంటెత్తు పోకడను సాకుగా చూపి అవకాశం కోసం ఆశగా గమనిస్తున్నారు.
======================

ఒంటరి నిర్ణయాలతో ఏకాకిగా..?
ముఖ్యమంత్రి రేవంత్ తాను సాదాసీదా నాయకుడిగా ఉన్నప్పటి నుంచి గమనించిన సంపద దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని తీసుకున్న నిర్ణయం నిజంగా సాహసోపేతమే. ఎడాపెడా చెరబట్టిన ఆస్తులను విడిపించడానికి ఆయన ఎంచుకున్న పంథా ఎవరికీ మింగుడుపడడం లేదు. సంప్రదించారో లేదో తెలియదుకానీ ముఖ్యమంత్రి తెగింపునకు అన్ని పార్టీల్లోని మహమహ నాయకులే హడలుతున్నారు. ఇక స్వపక్షంలోని పెద్ద తలలు ఎక్కడ పలుచనవుతామోనని పైకి మాత్రం భేష్ అంటూ తేలుకుట్టిన దొంగల్లా నక్కినక్కి దాక్కుంటున్నారు.
=================

రుణమాఫీ సెమీస్..
రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ అనేది కాంగ్రెస్ సర్కార్ చారిత్రక నిర్ణయం. సీఎం అనుకున్నది సాధించే దిశగా కదులుతుంటే ప్రతిపక్షం అన్యాయమైన రైతులను ఒక్కటి చేయడానికి నడుం బిగించాయి. ఇప్పటికే బంద్ పిలుపులు, ధర్నాలు, రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణలతో నానా హంగామా సృష్టించింది. అదివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దనే పట్టుదలతో ఉంది. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలకు అంతగా అవగాహన లేకనో మరేమోగానీ బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. పైగా ఒక్కో నేత ఒక్కో లెక్క చెబుతూ సర్కార్ లెక్కలన్నీ తప్పులే అనే తీరుగా హస్తం మంత్రులే స్వయంగా ఆధారాలు ఇస్తున్నారు. మూడు విడతల్లో మొత్తం మాఫీ చేశామని ముఖ్యమంత్రి పేర్కొంటుంటే, కేవలం 22 లక్షల మందికే మాఫీ అయినట్టుగా ఆయా అమాత్యులు చెప్పిన వివరాలు చూస్తే తెలుస్తోంది.

ప్రశ్నలకు నో ఆన్సర్..
కాంగ్రెస్ సర్కార్ మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేశామని గర్వంగా చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఒక్కో విడతలో చేసిన మాఫీ ఎంతా..? లబ్ధిపొందిన రైతులెందరు..? తీసుకున్న ప్రాతిపదిక ఏంటి..? జరగని వారికి తీసుకునే చర్యలేంటి..? మళ్లీ రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి..? అనే బీఆర్ఎస్ సవాళ్లకు ఒక్కటంటే ఒక్కటి కూడా సమాధానం స్పష్టంగా ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో రుణమాఫీ విషయంలో స్పష్టత లోపించిందనే విషయాన్ని సర్కారే తప్పని సరై ఒప్పుకోవాల్సిన దుస్థితి.

హైడ్రాతో మరింత హైరానా..
చెరువులను చెరబట్టిన బడాబాబుల భరతం పట్టడానికి ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పుడు రేవంత్ ను ఏకాకిని చేసింది. సినీ ప్రముఖులు, రాజకీయ పెద్దలు, వీఐపీలు, ఇతర ఉన్నత వర్గాలకు చెందిన ఆస్తులను అడ్డూఅదుపు లేకుండా, ఆధారాలు లేవనే సాకుతో కాంగ్రెస్ సర్కార్ నేలమట్టం చేయిస్తున్నది. అందరినీ ఎదిరించి హైడ్రాకు పూర్తి బలాలను అందించిన సీఎం ఇప్పుడు అన్ని వర్గాలకు వ్యతిరేకిగా మారారు. ప్రజలకు మంచి చేయడం ఎవడికి కావాలి.., నాయకులుగా మమ్మల్ని కాపాడుకోవాల్సిన వ్యక్తి అలా చేయడం ఏంటని ఇతర పార్టీలతో పాటు స్వయానా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రేవంత్ మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు ఫండ్స్, సమావేశాల సమయంలో అయ్యే చెల్లింపులు, కావాల్సిన ఏర్పాట్లను భరించే తమకే పంగనామం పెట్టేందుకు చూస్తున్నారని మండిపడుతున్నారు. మొన్నటి వరకు అంతా సీఎంకు సపోర్టుగా ఉన్నవారు హైడ్రా రంగప్రవేశంతో కప్పుకున్న తోలును తొలగించుకుని అసలు రూపాలను ప్రదర్శిస్తున్నాయి.

తేడా వస్తే గోవిందా..
సీఎం మాఫీ, హైడ్రాల టఫ్ ఇష్యూ ల మధ్య యాత్ర సాగిస్తున్నారు. ఎన్నో ఒత్తిళ్లు, మరెన్నో విమర్శలు.., అయినా ధైర్యం కోల్పోకుండా ముందుకెళ్తూనే ఉన్నారు. కాళ్లు పట్టుకుని లాగే వాళ్లను తప్పుకుంటూ, వెనక నుంచి తన్నే వాళ్లను గమనించుకుంటూ, వెంటే నడుస్తూ కాళ్లల్లో కాళ్లు వాళ్లను దూరంపెడుతూ నడక సాగిస్తున్నారు. హైడ్రాలో బడాబడా నాయకులు, సెలబ్రిటీలు విలువైన ఆస్తులను కోల్పోతుండడంతో అందరూ కలిసి సీఎంపై కక్ష కట్టారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా పార్టీలతో సంబంధం లేకుండా కబ్జాదారులంతా ఏకమై ఆయనను ఏకాకిని చేసే యత్నం చేస్తున్నారు. ఇంత వివాదాస్పమైన విషయాల పట్ల సీఎం అనుసరిస్తున్న మొండి తనాన్ని చివరి వరకు కొనసాగించేలా బలం కూడగట్టుకుంటారా.. లేదంటే ఎవరెవరి ఒత్తిళ్లో, మరెవరి బ్రేకులకు తలొగ్గి మధ్యలోనే కాడి ఎత్తేస్తారా..? అనేది కాలమే తేల్చాలి. ఒక రకంగా చెప్పాలంటే సీఎం పులిపై స్వారీ చేస్తూ బ్యాలెన్స్ ను కాపాడుకుంటేనే చివరి వరకు నడకు సాగించగలడుగానీ, ఏ మాత్రం పట్టు తప్పినా పులికే ఆహారం అవాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే జరిగితే రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఎంతో కోల్పోవాల్సి వస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా ఇది కొసెళ్లుతుందా.. మునుగుతుందా.. అనేది చూడాలిమరి..

RELATED ARTICLES

తాజా వార్తలు