Lok Sabha Elections | న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో విడుత పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడుతలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 93 నియోజకవర్గాల్లో 1300 మందికిపైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమవుతుంది.
గుజరాత్‌లో 25, కర్ణాటక 14, మహారాష్ట్ర 11, యూపీ 10, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్‌గఢ్ 7, బీహార్ 5, పశ్చిమ బెంగాల్ 4, అసోం 4, గోవా 2, దాద్రానగర్ హవేలీ, దమణ్ దీవ్‌లో 2 స్థానాల్లో పోలింగ్ జరగుతోంది. ఈ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 17.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 8.39 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
మూడో విడుతలో కేంద్ర మంత్రులు అమిత్ షా, జ్యోతిరాధిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, పరుషోత్తమ్ రూపాలా, ప్రహ్లాద్ జోషి, ఎస్పీ సింగ్ బఘేల్ ఉన్నారు. ఇక ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మైన్‌పురీలో పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో బారామతి నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ కుమార్తె, సిటింగ్ ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ బరిలో ఉన్నారు.