Govindarajaswami Temple | తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 5.30 గంటలకు అంకురార్పణ ఘట్టం ప్రారంభమైంది. ముందుగా సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ క్రతువు నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూపరింటెండెంట్ మోహన్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ పాల్గొన్నారు.
రేపు ధ్వజారోహణం
గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు గురువారం ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. గురువారం రాత్రి పెద్దశేష వాహన సేవ జరుగనున్నది. 17న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు విహరిస్తారు. 18న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం, 19న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 20న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించనున్నారు. 21న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం.. 22న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 23న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం 24న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సాలు ముగుస్తాయి.