Traffic Restrictions | హైదరాబాద్ : జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని గన్ పార్కు, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు గన్ పార్క్ వైపు ట్రాఫిక్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి లేదన్నారు. అలానే హుస్సేన్ సాగర్ ప్రాంతాల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ, అంబేద్కర్ విగ్రహం, తెలుగు తల్లి జంక్షన్, లిబర్టీ, ఇక్బాల్ మినార్, ఇందిరా గాంధీ రోటరీ, పీవీ విగ్రహం, కర్బలా, ఓల్డ్ సైఫాబాద్, రవీంద్ర భారతి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అప్పర్ ట్యాంక్ బండ్ మీదుగా వాహనాలకు అనుమతి లేదు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్ బంద్ నుంచే అనుమతిస్తారు. రవీంద్ర భారతి, ఎన్టీఆర్ మార్గ్, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు.