హైదరాబాద్ : బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఓ గోడ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగించారు. శిథిలాల కింద ఉన్న ఏడు మృతదేహాలను బయటకు వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను తిరుపతిరావు(20), శంకర్(22), రాజు(25), రామ్ యాదవ్(34), గీత(32), హిమాన్షు(4), ఖుషిగా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షానికి గోడ కూలినట్లు అధికారులకు సీఎంకు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఇక బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీ వద్ద ఓ రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. ఆ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.