హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం మూడు విడుతల్లో అడ్మిషన్స్ ప్రక్రియను ఉన్నత విద్యామండలి (TSCHE) చేపట్టనుంది. ఏప్రిల్ 24న ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో డిగ్రీ మొదటి సంవత్సం కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం శుక్రవారం నోటిఫికేషన్‌ను ప్రకటించనుంది. గతేడాది రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ ఏడాది మొత్తం 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో సహా దాదాపు 1,054 కాలేజీలు దోస్త్ పరిధిలో ప్రవేశాలు కల్పించనున్నాయి. రాష్ట్రంలో ఉన్న పలు యూనివర్సిటీల్లోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను కూడా దోస్త్ ద్వారానే భర్తీ చేయనుంది.
విద్యార్థులు దోస్త్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ప్రవేశం పొందే అవకాశమున్నది. నచ్చిన, అందుబాటులో ఉండే యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్న కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. దోస్త్ ద్వారా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అందుకోసం విద్యార్థులు ముందుగానే తమ ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. టీ-యాప్ ద్వారా https://dost.cgg.gov.in విద్యార్థులు లాగిన్ కాగానే వారికి దోస్త్ ఐడీ, పిన్ నంబరు వస్తుంది.
వీటిని ఉపయోగించి దరఖాస్తు పూర్తి చేసుకోవా లి. అందులో కోర్సులు, కాలేజీల వారీగా ప్రాధాన్యతా క్రమంలో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఏ దశ కౌన్సెలింగ్‌లో అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న కళాశాలకు వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించి, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.