Friday, April 4, 2025
HomeTelanganaరుణం రణం.. ఏది నిజం

రుణం రణం.. ఏది నిజం

జనపదం -ఆదివారం -18-08-2024 E-Paper

రుణం రణం
ఏది నిజం

పార్టీల మధ్య లెక్కల యుద్ధం..
రుణమాఫీపై సవాళ్లు ప్రతిసవాళ్లు..
చిలికిచిలికి గాలి వానగా ఇష్యూ…
తారాస్థాయికి మాఫీ లొల్లి..
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
రీసెంట్ గా బీజేపీ ఎంట్రీ…

రైతు రుణమాఫీ కయ్యానికి ఆజ్యం పోసింది. అన్నదాత ముందు మార్కులు కొట్టేయాలనే ఆతృత అమ్మనా బూతులు తిట్టుకునే వరకు తీసుకెళ్లింది. వాళ్లు ఒక్కటిస్తే మేము రెండిస్తున్నామనే హామీ పార్టీల మధ్య కుంపటిని రాజేయగా.., చేస్తున్న పనిలో మంచిని వదిలి చెడునే వెతుకుతున్నారనే పరస్పర ఆరోపణలు కొట్లాటను పెంచిపోషిస్తున్నాయి. గత సర్కార్ లెక్కలకు, ప్రస్తుత ప్రభుత్వపు వివరాలకు పొంతన కుదరక జగడం పెద్దగవుతుంటే., దక్కిన వారు సంబురంగా, దక్కని వారు అన్యాయమైందనే ఆవేదనతో తలాఓ వైపు చేరి లొల్లికి బలం చేకూరుస్తున్నారు. రాష్ట్రంలో రైతు రుణం బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య మాటల యుద్ధాన్ని చేయిస్తుండగా, నేతలు పాత పెంకలు తోడుకుంటూ నవ్వుల పాలవుతున్నారు.
===================
రైతు రుణం చుట్టే రాజకీయం గిరగిరా తిరుగుతున్నది. అధికారం దుర్వినియోగమని బీఆర్ఎస్ దుయ్యబడుతుంటే.., అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ కౌంటరిస్తున్నది. మూడు విడతల మాఫీ పర్వంలో పొంతన లేని లెక్కలు.., స్పష్టత లేని మాటలు., రోజురోజుకో కొత్త చిక్కులతో ఇరు పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. జూన్ 21వ తేదీన కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం మాట తీరు నుంచి ఆగస్టు 15 వరకు మూడు విడతలుగా జరిగిన మాఫీ ప్రక్రియలో ప్రతి రోజు ఓ ప్రత్యేకంగానే మారగా.., ప్రతి లెక్కా నిందకు ఆధారంగానే తయారైంది.

లెక్కలు..చిక్కులు..
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న రుణమాఫీ ఫైట్ ఆరోపణలు, ప్రత్యారోపణలుగా సాగుతూనే ఉంది. లెక్కల్లోని చిక్కులు ప్రతిపక్షానికి బలంగా మారగా, అధికార కూటమికి గుక్కతిప్పుకోకుండా చేస్తున్న పరిస్థితి. రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం నుంచి ప్రభుత్వం తగ్గిస్తూ వస్తున్న నిధులు., ప్రతిపక్షం అదెందుకు అని అడుగుతున్న తీరు ఆలోచించే విధంగానే మారాయి. లెక్కల వివరాలు చూస్తే…
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని, రూ.2 లక్షలు ఒకే విడుతలో చేస్తామని మొదటి నుంచి చెబుతూనే వచ్చింది. రాష్ట్రంలోని రైతులు డిసెంబర్, 2023 నాటికి రూ.49,500 కోట్ల రుణాలు తీసుకున్నారని ప్రకటించింది. తదనంతరం జూన్ 21వ తేదీన కేబినెట్ మీటింగ్ ముగిసిన అనంతరం ఒఖే విడుతల రుణమాఫీ చేయబోతున్నామని మొత్తంగా 47 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల అవసరం ఉందని తెలిపారు. అదే విషయాన్ని స్వయంగా జూలై 18వ తేదీన రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తూ సీఎం మరోమారూ చెప్పారు. కాగా, రుణమాఫీ కోసం బడ్జెట్ లో మాత్రం రూ.26000 కోట్లు కేటాయించారు. కానీ, మూడు విడతలుగా రుణమాఫీలో కేవలం సుమారు రూ.17,934 కోట్లు విడుదల చేసి పని ముగించారు.

రుణమాఫీపై సవాళ్లు ప్రతిసవాళ్లు..
ఎన్నికల వేళ హామీ ఇచ్చినంత తేలిక కాదు., నెరవేర్చడానికి నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ప్రతిపక్షం ప్రభుత్వాన్ని హెచ్చరికతో కూడిన దెప్పిపొడుపూ ఇస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీ విషయమై సాధ్యాసాధ్యాలను ప్రజలకు చేరవేడానికి లెక్కలేసి మరీ చూపడం., ప్రభుత్వం చెబుతున్న అవాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుండడంతో పార్టీల మధ్య వార్ వాతావరణం రాజుకుంది. రూ.2 లక్షల రుణమాఫీని ఒకే విడతలో చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఒకే విడత సాధ్యం కాదని గ్రహించిన సర్కార్ మూడు విడతల్లో చేసి చూపుతామని, అప్పుడు మాట్లాడుదామని ఒకదశలో సవాల్ ను స్వీకరించినట్టుగా సంకేతాలు ఇచ్చింది. సరే మాఫీ అయితే చూద్దాం అన్నట్టుగా హరీష్ సవాల్, రేవంత్ ప్రతిసవాల్ నడుస్తూనే ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీతో మూడు విడతల్లో మాఫీ పూర్తి చేశాం.., ఇక రాజీనామా చేయాల్సిన బాధ్యత హరీశ్ పైనే ఉందని కాంగ్రెస్ శ్రేణులు విరుచుపడడం మొదలు పెట్టాయి.

చిలికిచిలికి గాలి వానగా…
హరీష్ రావు ఎలాగైనా పదవికి రాజీనామా చేసి మాట నిలుపుకోవాలని స్వయంగా సీఎం వైరా వేదిక నోటికొచ్చినట్టు మాట్లాడి ఇష్యూకు మరింత ఆజ్యం పోశారు. దానికి వివరణగా హరీష్ రావు కూడా ఘాటుగానే స్పందించారు. అయితే గియితే రుణమాఫీకి నిధులు పెరగాలి.., లేదంటే కనీసం గతంలో ఉన్నంతవరకైనా ఉండాలిగానీ., మునుపటితో పోల్చితే మరింత తగ్గడమేంటని ప్రశ్నించారు. యేటేటా రైతులు పెరగడం., రుణాలు తీసుకున్నవారు ఎక్కువవడం జరుగుతుంటే, మాఫీ మాత్రం ట్రైన్ రివర్స్ అన్నట్టుగా నానాటికి తగ్గడమేంటని నిలదీశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారింది.

తారాస్థాయికి మాఫీ లొల్లి..
రుణమాఫీ లొల్లి ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లొల్లిగా కాకుండా పర్సనల్ ఆరోపణ వరకు వెళ్లింది. ఒకరి తప్పులను మరొకరు తవ్వుకుంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రైతులకు అన్యాయం జరిగిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి కూడా ప్రభుత్వాన్ని తప్పుబడుతుండడంతో జగడం మరింత ముదురుతోంది. సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం లేదని, మోసపూరిత లెక్కలతో ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నాడని ఆరోపిస్తున్నారు. రుణమాఫీ సక్రమమని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని ఆయన ముఖ్యమంత్రికే సవాల్ విసిరారు. రెండు పార్టీల మధ్య లొల్లి., ఇప్పుడు బీజేపీ కూడా ఎంటర్ కావడంతో మరింత మందమవుతున్నది. రుణమే రణంగా సాగుతున్న తీరులో అన్ని పార్టీలు తలా ఓ చేయి వేసి లాక్కెళ్లుతున్న తీరుకు ముగింపు ఎప్పుడో..?

RELATED ARTICLES

తాజా వార్తలు