Thursday, April 3, 2025
HomeTelangana‘బలుపు’ ముచ్చట్లు..?! విగ్రహాలే చెవులు మూసుకునేలా..!

‘బలుపు’ ముచ్చట్లు..?! విగ్రహాలే చెవులు మూసుకునేలా..!

జనపదం – బుధవారం -21-08-2024 E-Paper

‘బలుపు’ ముచ్చట్లు..?!
విగ్రహాలే చెవులు మూసుకునేలా..!

కేటీఆర్ వర్సెస్ రేవంత్
ముదురుతున్న మాటల యుద్ధం
బిడ్డా.. అధికారం కలే.. : సీఎం రేవంత్
అవకాశం వస్తది అన్నీ గుర్తుపెట్టుకో.. : కేటీఆర్‌
నోరు పారేసుకుంటున్న బడానేతలు..
చర్యలు తీసుకోవాలని ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు..

=============================
వాక్ దాడి విచక్షణ కోల్పోతున్నది. బలుపు మాటలు శృతిమించుతున్నాయి. నువ్వెంతంటే.., నువ్వెంతా.. అనే సవాల్, ప్రతిసవాల్ పెచ్చరిల్లుతున్నది. పని కోసం తిట్టుకుంటున్నారో.., తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారోగానీ సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అటు తెలంగాణ తల్లి, ఇటు రాజీవ్ గాంధీ విగ్రహ రూపంలో ఉన్నారు కాబట్టి బతికిపోతున్నారుగానీ లేదంటే వీళ్ల బరితెగింపు బూతులకు వాళ్లెప్పుడో చెవులు మూసుకుని కనబడకుండా పారిపోయేటోళ్లేనేమో. నోరు తెరిస్తే చీరుడు., నరుకుడే.. అనే మాటలే తప్ప, నలుగురికి ఉపయోగపడే ముచ్చట్ట ఇద్దరి నుంచి వినిపించకపోవడం దురదృష్టకరం. సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ విగ్రహమేంటని కేటీఆర్., ప్రభుత్వ నిర్ణయాన్ని నువ్వు ప్రశ్నించేదేంటని సీఎం…, ఎవరి వాదప్రతివాదులుగా, పట్టువిడుపులు లేని వారుగా చెలరేగిపోతున్నారు.

================================

జనపదం, హైదరాబాద్ బ్యూరో

విగ్రహం చుట్టూ వివాదం ముదురుతోంది. సెక్రటేరియట్ చుట్టూ సమస్య జఠిలమవుతున్నది. రాజీవ్, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు వెనక రాజకీయ జోక్యం పేట్రేగుతున్నది. సంబంధం లేని వ్యక్తులవి ఎలా చేస్తారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తే.., నీకేం తెలుసు ఆయన గురించి .. ముమ్మాటికి చేసే తీరుతామని రాష్ట్ర సర్కార్ ఘాటైన సమాధానంతో చర్చ చిలికిచిలికి గాలివానగా మారుతోంది. రెండు విగ్రహాల ఏర్పాటు అధికార విపక్షాల మధ్య లొల్లిగా మారి, ఇప్పుడు సీఎం వర్సెస్ మాజీ మంత్రి మధ్య మాటల తూటాలు పేల్చుకునే వరకు దారి తీసింది.

కేటీఆర్ వర్సెస్ రేవంత్
అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం పెరిగింది. కీలక నేతలిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై వివాదం రచ్చకెక్కింది. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కూల్చివేస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయాలంటూ సీఎం రేవంత్ సవాల్ చేశారు. బీఆర్ఎస్ కు అధికారం పోయిన బల్పు మాటలు మాత్రం తగ్గడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ ఎదుట కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నాడన్నారు. కానీ సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదని, అక్కడ దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదన్నారు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ మాట్లాడడం అహంకారానికి నిదర్శనమని, చేతనైతే ఎవడైనా విగ్రహం మీద చేయి వేయాలంటూ సీఎం రేవంత్ సవాల్ చేశారు. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యలతో వివాదం మరింత పెద్దదైంది. ముఖ్యమంత్రి రేవంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

అధికారం కలే…
కేటీఆర్ నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా.. అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నావ్.. బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే. మీరు చింతమడకకే పరిమితమంటూ కౌంటర్ వేశారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదని చెప్పారు. తమ చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదని, విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుందని సీఎం హెచ్చరించారు.

గుర్తు పెట్టుకో రేవంత్ : కేటీఆర్
బీఆర్ఎస్ ఇక అధికారంలోకి రాదని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ జెండా ఎగురవేస్తామని, అధికారంలోకి వచ్చాక సచివాలయం ఎదుట కాంగ్రెస్ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలిగిస్తామని చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్‌ నా మాటలు గుర్తుంచుకోండని, ఎప్పుడూ ఒకే సమయం ఉండదని, తప్పకుండా అవకాశాలొస్తాయని, చేయాల్సింది చేసి తీరుతామని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రోజే అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చెత్త తొలిగిస్తామన్నారు. బీఆర్ఎస్ రాగానే సచివాలయం పరిసరాల్లో చెత్త తొలగిస్తాం.. ఢిల్లీ గులాంలు రాష్ట్ర ఆత్మగౌరవం అర్థం చేసుకుంటారని ఆశించలేం అన్నారు. చెత్తమాటలు మాట్లాడిన రేవంత్‌రెడ్డి నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తోందని కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
కాగా, పెద్ద నాయకులు ఒకరిపై ఒకరు దూషణ పర్వం అందుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆదర్శనంగా ఉండాల్సిన వారు ఒకరినొకరు అవమానించుకునే ధోరణిలో మాట్లాడుకోవడం విడ్డూరమని పలువుర పెదవి విరుస్తున్నారు.

చర్యలు తీసుకోవాలని ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు..
సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం ఇవ్వలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన ప్రవర్తన శైలి సభ్యసమాజం తలదించుకునేలా ఉందని బీఆర్ఎస్ మండిపడింది. ఈమేరకు సీఎం పై చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రతిపక్ష నేత కేటీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కలిగించేలా వ్యవహరిస్తున్నాడని, సీఎం స్థాయి వ్యక్తికి కనీస మర్యాద కూడా ఇవ్వకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేసి , తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు.

RELATED ARTICLES

తాజా వార్తలు