Election Deposit | ప్రస్తుతం దేశమంతటా లోక్‌సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా కొనసాగుతున్నాయి. రాజకీయ నేతల ప్రసంగాల్లో డిపాజిట్ అనే పదం తరచుగా వింటుంటాం. ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కనివ్వొద్దు, డిపాజిట్ గల్లంతు చేయాలంటూ ప్రసంగాలు చేస్తుంటారు. అసలు డిపాజిట్ అంటే ఏంటో తెలుసుకుందాం.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ సమయంలో నిర్దేశిత రుసుమును ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రుసుం మొత్తం తిరిగి పొందాలంటే.. ఎన్నికల్లో డిపాజిట్లు దక్కాలి. అంటే మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లు రావాలి. అంటే కనీసం 16 శాతం ఓట్లు నామినేషన్ వేసిన అభ్యర్థికి దక్కాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే.. ఆ అభ్యర్థి డిపాజిట్లు కోల్పోయినట్లు. అంటే నామినేషన్ దాఖలు చేసిన సమయంలో చెల్లించిన రుసుం మళ్లీ తిరిగి ఇవ్వబడదు. దీన్నే డిపాజిట్ గల్లంతు అయ్యారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో లక్ష ఓట్లు పోలయితే అందులో 16 వేల ఓట్లు సాధించి తీరాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే.. నామినేషన్ల ఉపసంహరణ తేదీ నాటికి స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటే.. డిపాజిట్ రుసుం తిరిగి ఇచ్చేస్తారు.
డిపాజిట్ దక్కించుకోవడమనేది ఓ పెద్ద సవాలే..
ఎన్నికల్లో డిపాజిట్ దక్కించుకోవడమనేది ఒక పెద్ద సవాలే. ఎందుకంటే ప్రధాన ప్రత్యర్థుల ముందు ఇజ్జత్ పోకుండా ఉండాలంటే డిపాజిట్ రావాలి. లేదంటే సదరు అభ్యర్థిని ఒక పనికిరాని నాయకుడిలా చూస్తుంటారు. అంతేకాదు.. అతనిపై విమర్శల దాడికి పాల్పడుతుంటారు. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకునేందుకు చాలా కష్టపడుతుంటారు.
78 శాతం నాయకులు డిపాజిట్లు కోల్పోయారు..
కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఉన్న సమాచారం ప్రకారం దేశంలో 1952 నుంచి 2019 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 91,160 మంది పోటీ చేయగా, ఇందులో 78 శాతం(71,245 మంది) అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 1996లో అత్యధికంగా 13,652 మంది పోటీ చేయగా వీరిలో 12,688 మందికి డిపాజిట్లు దక్కలేదు. 1957లో జరిగిన ఎన్నికల్లో అత్యల్పంగా 130 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2019 ఎన్నికల్లో 6610 మంది డిపాజిట్లు కోల్పోగా, వీరిలో 3443 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉండగా, 3,431 మందికి ఆరో వంతు ఓట్లు కూడా రాకపోవడంతో డిపాజిట్లను పోగొట్టుకున్నారు.