సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనో, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలనో, స్పీకర్ లేదా చైర్మన్‌నో ఏకగ్రీవంగా (Unanimous) ఎన్నుకోవడం చూస్తూ ఉంటాం. ఎవరైనా ప్రజాప్రతినిధి ఉగ్రవాదుల దాడుల్లో మరణిస్తే వారి గౌరవార్ధం కుటుంబ సభ్యులు పోటీచేస్తే మిగిలిన పార్టీలు పోటీ చేయనప్పుడు ఏకగ్రీవం అవుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో విచిత్ర సందర్భాలు చూస్తున్నాం. బెదిరించో, నయానో బయానో బతిమాలో బామాలో ఓ అభ్యర్థి ఇతరులను పోటీలో లేకుండా చేసి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. అసలు ఏ సందర్భంలో ఎన్నికల అధికారి (RO) ఏకగ్రీవం అని ప్రకటించవచ్చు? ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఏముంది?
సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ అసలు పోటీయే లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికవడంతోనే ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సంతకాలు సరిపోలలేదని కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ నామినేషన్‌ను ఆర్వో తిరస్కరించిన తీరు, కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి నామినేషన్‌ను రిజక్ట్ చేయడం, ఇతర స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఈ ఘటనలన్నింటి నడుమ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ధృవీకరించడం సర్వత్రా చర్చకు దారితీసింది. అయితే 1951 ప్రజాప్రాథినిధ్య చట్టంలోని సెక్షన్ 53(3) ప్రకారం రిటర్నింగ్ అధికారికి ఒకే అభ్యర్థి ఉంటే పోలింగ్ జరుగకుండానే ఎన్నికైనట్లు ప్రకటించే అధికారం ఉంది.
ఏదైనా నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి పోటీలో ఉంటే నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వెంటే ఆ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాలని, ఇలాంటి సందర్భాల్లో పోలింగ్ జరపాల్సిన అవరం లేదని రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల సంఘం (EC) అందజేసిన హాండ్‌బుక్‌లో ఉంది. అయితే ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థి నిర్ణీత సమయంలోగా నేర చరిత్రను వెల్లడించాల్సి ఉంటుంది.
కాగా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున ఆర్వో వద్దకు వెళ్లిన ఆయన తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. అయితే స్వతంత్రులు, చిన్న చితక పార్టీల అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. దీంతో అక్కడ ఎన్నికలు నామమాత్రమేనని, బీజేపీ విజయం శంకర్ విజయం ముందుగానే ఖరారైనట్లేనని అంటున్నారు.