తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. జనాల్లోనూ ఓ కొత్త చర్చ మొదలైంది. అదేంటంటే తెలంగాణ పీసీసీ పీఠం గురించి. పీసీసీ అధ్యక్ష పదవి (TPCC President) ఎవరిని వరిస్తుంది..? అనే అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్ంరి పదవిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండడంతో.. పీసీసీ అధ్యక్ష పదవి బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీలో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
సాధారణంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు టీ పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెడితే.. అగ్రవర్ణాల నేతకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. మరి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం. కాబట్టి బీసీ నాయకుడికి పీసీసీ పీఠం కట్టబెట్టి.. సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందా..? ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎందుకంటే.. గతంలో పీసీసీ అధ్యక్ష మార్పుపై పార్టీలో ప్రస్తావన వచ్చినప్పుడు.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ఆ పదవిపై చాలా మంది నాయకులు కన్నేశారు.
ఈ నేపథ్యంలో టీ పీసీసీ పదవిని చేజిక్కించుకునేందుకు ఆశావాహులు పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని, పార్టీ హైకమాండ్‌ను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాస్కీగౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
సాధారణంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే, అగ్రవర్ణాల నేతకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర సీఎం అగ్రవర్ణాలకు చెందిన రేవంత్ రెడ్డి కాబట్టి.. తప్పకుండా బీసీ సామాజిక వర్గానికే పీసీసీ పదవి వరిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేయాలని భావిస్తే.. తదుపరి పీసీసీ అధ్యక్షుడిగా ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతను ప్రకటించే నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని ఆయన ఉద్ఘాటించారు.
అయితే ప్రధాన పోటీదారుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేరే వినిపిస్తోంది. ఒక వర్గం నాయకులు కూడా ఆయనకే పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు కూడా తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాను కూడా పీసీసీ రేసులో ఉన్నట్టు మహేశ్ కుమార్ గౌడ్ అంగీకరించారు.
పీసీసీ అధ్యక్షుడు అయ్యే హక్కు ప్రతి కాంగ్రెస్ నాయకుడికి ఉంటుందన్నారు. తాను పార్టీ సీనియర్ కార్యకర్తని, టీపీసీసీ అధ్యక్షుడిగా తన వంతు ప్రయత్నం చేస్తున్నాను అని మహేశ్ కుమార్ గౌడ్ గురువారం మీడియా ప్రతినిధులతో పేర్కొన్న సంగతి తెలిసిందే. తన కంటే మెరుగైన నాయకులు ఉంటే పార్టీ హైకమాండ్ వారికే ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గాంధీభవన్ వర్గాల ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో కొత్త టీపీసీసీ అధ్యక్షుడి నియామకం కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉంది.