Polling Stations | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే అధికారులకు పలు దఫాలుగా శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ శిక్షణా కార్యక్రమాల్లో నేర్చుకున్న నియమాలను పోలింగ్ కేంద్రాల్లో అధికారులు అమలు చేయనున్నారు.
అయితే ఎన్నికల పోలింగ్ రోజున ప్రధాన సమస్య ఏంటంటే.. స్థానికులంతా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. అధికారులను బెదిరింపులకు గురి చేస్తుంటారు. ఇక ఘర్షణ వాతావరణం కూడా సృష్టించేందుకు వెనుకాడరు. మరి ఈ పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాల్లోకి ఎవరికి అనుమతి ఉంటుందనే విషయాలు తెలుసుకుందాం.
అనుమతి వీరికే..
1. పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్లు.
2. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లు.
3. ఎన్నికల విధులకు వచ్చిన అధికారులు, ఎన్నికల పరిశీలకులు.
5. మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, వెబ్ కాస్టింగ్ సిబ్బంది.
6. ఓటర్ వెంట ఉండే చంటి పిల్లలు.
7. అంధ, అంగవైకల్యం ఉన్న ఓటర్లకు సహాయం చేసే వ్యక్తులు.
8. ఎన్నికల సంఘం అనుమతించిన మీడియా ప్రతినిధులు.
అయితే ఓటర్లు తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి. పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు విధిగా ఎన్నికల అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులను చూపించి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలి. మీడియా ప్రతినిధులు కూడా ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
ఇక అభ్యర్థుల వెంట వచ్చే సెక్యూరిటీ సిబ్బందిని పోలింగ్ కేంద్రంలోని అనుమతించకూడదు. పోలింగ్ కేంద్రం తలుపు దగ్గరే వీరంతా ఆగిపోవాలి. ఓటర్లను కూడా ఒక్కొక్కరిని లోపలికి పంపించాలని ఎన్నికల సంఘం సూచిస్తుంది.