నర్సంపేట : గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక వేళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ పదేండ్లలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు రాహుల్ గాంధీ రుజువు చేస్తే రేపే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నర్సంపేటలో పెట్టిపోతా అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నియామకాలు జరగలేదు. పేపర్ లీక్‌లు జరిగాయని కొందరు పనికట్టుకుని యూట్యూబ్‌లో తప్పుడు ప్రచారం చేశారు. గత పదేండ్లలో 2014 నుంచి 2024 వరకు దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగ నియమకాలు చేసింది కేసీఆర్. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు కేసీఆర్. కానీ రెండు ఉద్యోగాలు ఇవ్వలేదు.. ఆయన ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఫేక్ ప్రచారం చేశారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. రేపు ఉదయం ఈ సమయానికల్లా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నర్సంపేటలో పెట్టి పోతా అని కేటీఆర్ సవాల్ విసిరారు.
మొత్తానికి తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను చెప్పుకోవడంలో మేం ఫెయిలయ్యాం. వరంగల్‌లో 26 అంతస్తుల్లో ఆస్పత్రి కట్టి చెప్పుకోలేకపోయాం. వరంగల్ జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీని నర్సంపేటలో పెట్టి చుప్పుకోలేకపోయాం. డిగ్రీ కాలేజీ కోసం కొట్లాడే నర్సంపేటలో.. కలలో అనుకోనిది కూడా చేసి చెప్పుకోలేక ఓడిపోయాం. ప్రభుత్వ ఉద్యోగులకు 73 శాతం జీతాలు పెంచారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు పొందారు. కానీ ఒకటో తారీఖున జీతాలు పడలేదని వారు దూరమయ్యారు. సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వడంతో.. వారికి ఆలస్యమైంది. ఉద్యోగాలిచ్చి చెప్పుకోలేక దూరమయ్యాం. దీంతో 1.8 తేదాతో ఓడిపోయాం. ప్రతిపక్షంలో ఉన్నాం అని కేటీఆర్ తెలిపారు.