హైదరాబాద్ : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. ఈ నెల 17వ తేదీన నిమజ్జనంతో గణేశ్ ఉత్సవాలు ముగుస్తాయి. నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 17, 18 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాలు వైన్ షాపులతోపాటు కల్లు దుకాణాలు, బార్లకూ వర్తిస్తాయని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
గణేశ్ నిమజ్జనంతోపాటు మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు కూడా ఉండడంతో.. ఈ రెండు కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కమ్యూనల్ రౌడీలు, సంఘ విద్రోహ శక్తులపై పూర్తి నిఘా ఉంచాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.