YS Sharmila | ఏపీ ముఖ్యమంత్రి, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కడపలో ఆమె శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన రాజకీయ కాంక్ష వల్లే వైఎస్సార్ కుటంబుంలో విభేదాలు వచ్చాయని జగన్ వ్యాఖ్యానించారని.. నా రాజకీయ కోరికను ప్రోత్సహిస్తే అది బంధుప్రీతికి దారితీస్తుందని… కుటుంబంలో కలతలకు ఇదే కారణమని చెప్పారన్నారు. తాను చెల్లెలిగా సూటిగా ప్రశ్నిస్తున్నానని.. తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ఎవరు? అన్నారు.
జగన్ అరెస్టయితే 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని.. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని అడిగింది జగన్ కాదా? అని నిలదీశారు. జగన్ జైలుకు వెళ్లిన సందర్భంలో.. బాబు ఓ వైపు పాదయాత్ర చేస్తున్నారని.. ఆయన గ్రాఫ్ పెరుగుతుండడంతో నన్ను పాదయాత్ర చేయాలని చెప్పింది మీరే కదా? అంటూ గుర్తు చేశారు. సమైక్యాంధ్ర, తెలంగాణలో ఓదార్పు యాత్ర, బైబై బాబు ప్రచారం కోసం ఉపయోగపడింది నేను కాదా.. మీ అవసరం కోసం నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ జైలులో ఉన్నప్పుడు, పాదయాత్ర చేస్తున్న సమయంలో పార్టీ అంతా తనచుట్టే తిరుగుతోందని.. తనకు రాజకీయ కాంక్షే ఉంటే.. వైఎస్సార్‌సీపీని హస్తగతం చేసుకొని ఉండేదాన్ని కదా? అన్నారు.
జగన్ వస్తాడని.. రాజశేఖర్‌రెడ్డిని మరిపించేలా పాలన చేస్తాడని కాలికి బలపం కట్టుకొని తిరిగింది తాను కదా? అంటూ నిలదీశారు. తాను ఎన్నో త్యాగాలు చేశానని.. తనకు రాజకీయ కాంక్ష ఉందంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తనకే రాజకీయ కాంక్ష ఉండి ఉంటే.. వైఎస్సార్‌సీపీలోనే పొందాలనుకునే పదవిని పొందేదాన్నని.. తనను ఎంపీగా చేయాలని వైఎస్ వివేకానందరెడ్డితో పాటు పార్టీలోని పలువురు నేతలే కోరుకున్నారన్నారు. వారి అండ చూసుకొని ఎప్పుడైనా ధిక్కరించానా?.. మీరు ముఖ్యమంత్రి అయ్యేంత వరకేమో నాకు రాజకీయ కాంక్ష.. డబ్బు కాంక్ష లేనట్టా? ఏం చేసినా మీ కోసం చేసినట్టా..? ఇప్పుడు రాజకీయ కాంక్ష, డబ్బు కాంక్ష ఉన్నట్టా? అంటూ నిలదీశారు.
ఇద్దరం కలిసి బైబిల్‌పై ఒట్టేద్దామని.. తనకు రాజకీయ కాంక్ష కానీ, డబ్బు కాంక్ష కానీ లేవని.. ఏమీ ఆశించకుండా మీకోసం చేశానని తాను చెప్పగలనని.. అదే బైబిల్ మీద ప్రమాణం చేసి… నేనేదైనా పదవి అడిగానని మీరు చెప్పగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉందని కానీ, డబ్బు కాంక్ష ఉందని జగన్ చెప్పగలరా? అన్నారు. మనిషిని, మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్ రెడ్డి నుంచి ఎందుకు రాలేదని.. వైఎస్సార్ ఏనాడూ స్వలాభం కోసం ఆలోచించలేదన్నారు. నమ్మిన ఆశయాల కోసం ఏవిధంగా త్యాగం చేసే మనసు ఆయనకు ఉందో.. అదే విధంగా నిస్వార్థంగా మీ కోసం నేను త్యాగం చేశానని షర్మిల కన్నీటి పర్యంతమయ్యారు.